టీమిండియాపై నెగ్గాలంటే ఇలా చేయాలి

టీమిండియాపై నెగ్గాలంటే ఇలా చేయాలి

ఆదివారం  ఓల్డ్ ట్రాఫోర్డ్ లో టీమిండియాతో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ నెగ్గాలంటే ఆరంభంలోనే వికెట్లు త్వరగా పడగొట్టాలని పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సలహా ఇచ్చాడు. ఇందుకు పాక్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజయం నుంచి స్ఫూర్తి పొంది మైదానంలోకి దిగాలని వకార్ సూచించాడు. ఐసీసీకి రాసిన వ్యాసంలో ఇది చాలా సులువైన విషయం అని యూనిస్ పేర్కొన్నాడు. ఈ టోర్నమెంట్ లో నిలిచి కొనసాగాలంటే భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ 'ఏ ప్లస్' ప్రదర్శనతో గెలిచి తీరాలని చెప్పాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ పెద్దదేనని, కానీ ఆదివారం జరగబోయే మ్యాచ్ మరెంతో కీలకమైనదని అన్నాడు.

ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై భారత్ కు నూటికి నూరు శాతం విజయాల రికార్డు ఉండటాన్ని కొట్టిపారేస్తూ వకార్, తమ జట్టు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రేరణ పొందాలన్నాడు. ఆ ట్రోఫీ ఫైనల్ లో పాక్ భారత్ ను ఓడించింది. ఆ మ్యాచ్ నుంచి స్ఫూర్తి పొందుతూ పాక్ సానుకూల దృక్పథంతో మైదానంలోకి దిగాలని చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లను చూసిన తర్వాత ఆట ఆరంభంలో త్వరగా వికెట్లు తీయకపోతే తర్వాత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని గమనించినట్టు మాజీ కెప్టెన్, కోచ్ కూడా అయిన వకార్ తెలిపాడు. కొత్త బంతి కీలకమని, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మొదటి పది ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సి వస్తోందని గుర్తు చేశాడు. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో కొత్త బంతి ప్రభావవంతంగా ఉపయోగించడంలో పాక్ విఫలమైందని చెప్పాడు. ఆ తర్వాత మొహమ్మద్ ఆమీర్ విజృంభించి ఐదు వికెట్లు తీసినా అతనికి రెండో వైపున సహకారం కరువైందని తెలిపాడు. జట్టు కూర్పు విషయానికొస్తే మికీ ఆర్థర్ ఈ మ్యాచ్ కి టీమ్ లో మార్పులు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు.