టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్

టౌంటన్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇవాళ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ ను 14 పరుగులతో ఓడించిన పాక్, ఇవాళ కూడా అదే ఊపుని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో 36 పరుగుల తేడాతో చిత్తయింది. గాయపడిన ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ స్థానంలో షాన్ మార్ష్ ను జట్టులోకి తీసుకుంది. ఆడమ్ జంపా స్థానంలో కేన్ రిచర్డ్ సన్ జట్టులోకి వచ్చాడు. ఇక పాకిస్థాన్ కూడా షాదాబ్ ఖాన్ కి బదులు షహీన్ ఆఫ్రీదీని తుది జట్టులోకి ఎంపిక చేసింది. 

ఈ వరల్డ్ కప్ లో అత్యంత అనూహ్యమైన జట్టుగా పేరొందిన పాక్, ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. కానీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, వన్డే ర్యాంకింగ్ లలో నెంబర్ వన్ గా ఉన్న ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. శ్రీలంకతో ఆడాల్సిన పాక్ మూడో మ్యాచ్ ఒక బంతి కూడా పడకుండానే వర్షార్పణం కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.