భార్యా, పిల్ల‌లా... భార‌త్ మ్యాచ్ త‌ర‌వాతే....

భార్యా, పిల్ల‌లా... భార‌త్ మ్యాచ్ త‌ర‌వాతే....

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఎట్టకేలకు ఇంగ్లాండ్ లో జరగబోయే వరల్డ్ కప్ లో ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉండేందుకు అనుమతించింది. అయితే జూన్ 16న తమ చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ తర్వాత మాత్రమే వాళ్లు తమ కుటుంబాలతో గడపవచ్చని ఇందులో ఒక మెలిక పెట్టింది. ఇటీవలే ఇంగ్లాండ్ తో ఆడిన ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ సమయంలోతమ కుటుంబాలను తమతో తీసుకెళ్లేందుకు ఆటగాళ్లను  పీసీబీ అనుమతించింది. కానీ గత నెలలో ప్రపంచ కప్ జరిగేటపుడు కూడా ఇదే విధంగా అనుమతించాలన్న కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విజ్ఞప్తిని తిరస్కరించింది. 

ఆస్ట్రేలియాతో జూన్ 12న జరగబోయే మ్యాచ్ తర్వాత తమ భార్యాబిడ్డలను తమతోనే ఉంచుకొనేందుకు అనుమతించాలని పాకిస్థానీ ఆటగాళ్లు కోరినట్టు పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. 'మిగతా జట్ల వైఖరిని చూసిన తర్వాత బోర్డు తన పాత నిర్ణయాన్ని సమీక్షించాలని నిర్ణయించినట్టు' తెలిపారు. జాతీయ జట్టులోని సభ్యులు బోర్డు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాళ్లు అనేక మార్లు వినతులు అందజేశారు. ప్రపంచ కప్ లో పాక్ టీమ్ తన ప్రారంభ మ్యాచ్ మే 31న వెస్టిండీస్ తో ఆడనుంది. దాని కంటే ముందు బంగ్లాదేశ్ తో ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.