ధావన్ స్థానంలో పంత్ కు పిలుపు?

ధావన్ స్థానంలో పంత్ కు పిలుపు?

మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ గాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ విసిరిన బంతి దెబ్బకి ధవన్ ఎడమచేతి బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. అతను మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో గబ్బర్ కనీసం రెండు వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడలేడు. దీంతో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అయితే భారత సెలెక్టర్లు అంబటి రాయుడు, రిషభ్ పంత్, నవ్ దీప్ సైనీ, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ లను రిజర్వ్ లుగా ఉంచారు. ఇప్పుడు వారిలో ఎవరినైనా ఇంగ్లాండ్ కు పంపించే అవకాశం ఉంది. కానీ పంత్ ని ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మతో కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. కొత్తగా భారత్ నుంచి వెళ్లే ఆటగాళ్లెవరైనా మిడిలార్డర్ లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. 

ధవన్ లోటును పూడ్చేందుకు ఢిల్లీ యువ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్ బయల్దేరుతున్నాడని తెలుస్తోంది. మరికాసేపట్లోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరో 48 గంటల్లోగా పంత్ బయల్దేరవచ్చు కానీ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆడకపోవచ్చు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

నిజానికి ప్రపంచ కప్ జట్టులో పంత్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనుభవ రీత్యా రిషభ్ పంత్ ని పక్కనపెట్టి దినేష్ కార్తీక్ ను తుది జట్టులోకి ఎంపిక చేయడం విమర్శలకు దారి తీసింది. పంత్ ఇంగ్లాండ్ వెళ్తే అతనిని నెంబర్ 4గా పంపవచ్చు. రాహుల్ ను నాలుగో స్థానంలో, ఓపెనింగ్ జోడీ  లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలని భావిస్తే ధవన్ స్థానంలో పంత్ ఓపెనర్ అవతారం ఎత్తవచ్చు.