బౌలర్ల అత్యద్భుత ప్రదర్శనపై కోహ్లీ ప్రశంసలు

బౌలర్ల అత్యద్భుత ప్రదర్శనపై కోహ్లీ ప్రశంసలు

శనివారం ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో పసికూనలు ఆఫ్ఘనిస్థాన్ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియాను చివరి బంతి వరకు వణికించింది. ఈ విజయం అత్యద్భుతమైందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభివర్ణించాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, ఈ విజయం వారి వల్లనే సాధ్యమైందంటూ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఓటమి అన్నదే ఎరగకుండా దూసుకెళ్తున్న భారత్ కు ఈ విజయం ఎంతో కీలకమైంది. టాస్ గెలిచి భారీ స్కోరు లక్ష్యంగా నిర్దేశించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ నిర్ణయాన్ని భారత బ్యాట్స్ మెన్ నిలబెట్టలేకపోయారు. ఆఫ్ఘన్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడ్డారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో నిలకడగా బంతులేస్తున్న ఆఫ్ఘన్ బౌలింగ్ లో పరుగులు తీయలేకపోయారు. దీంతో భారత్ 225 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ ముందుంచింది. కానీ మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్ పరిస్థితులకు తగ్గట్టు రాణించి జట్టుకు విజయం సాధించి పెట్టారు.

మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ 'ఇది ఒక అద్భుత విజయం. 50వ ఓవర్ లో షమీ బౌల్ చేసేందుకు వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉండేలా చూస్తూ 49వ ఓవర్ లో బుమ్రా ఓవర్లు ముగించాలని సందేశం వచ్చింది. ఆ ప్రణాళిక ఇవాళ బాగా పని చేసింది. చహల్ ఓవర్లు మిగిల్చి పెట్టడం కూడా పనిచేసింది. మొత్తంగా బౌలింగ్ ప్రదర్శన అత్యద్భుతం' అని కోహ్లీ బౌలర్లను ఆకాశానికి ఎత్తేశాడు. జట్టు స్థైర్యానికి ఈ విజయం ఎంత కీలకమో వివరిస్తూ 'ముందు అనుకున్నట్టుగా జరగలేదు. కానీ ఈ విజయం చాలా కీలకం. మీరు అనుకున్నట్టు జరగకపోతే మీరు పట్టుదల చూపాలి. చివరి బంతి వరకు పోరాడాలి. ఈ గెలుపుతో మేం చాలా ఆత్మవిశ్వాసం పొందాం. దాంతో ముందుకెళ్తాం' అన్నాడు. 

నాటకీయంగా మొహమ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించడంతో భారత్ ఆఫ్ఘనిస్థాన్ పై 11 పరుగుల తేడాతో నెగ్గింది. శనివారం సౌథాంప్టన్ లో జరిగిన మ్యాచ్ లో పసికూనలు ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం నమోదు చేసేలా కనిపించారు. తమ రెండో వరల్డ్ కప్ ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్ టాస్ ఓడిపోయినా 50 ఓవర్లలో 224 పరుగులే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టింది. మొహమ్మద్ నబీ, నజీబుల్ల జాద్రాన్ జాగ్రత్తగా ఆడుతూ భారత జట్టుకి షాకిచ్చేలా కనిపించారు. కానీ 42వ ఓవర్ లో జట్టు స్కోరు 6 వికెట్లకు 166 ఉన్నపుడు హార్దిక్ పాండ్యా వేసిన బంతిని ఆడబోయిన జాద్రాన్ చహల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి ఓవర్ వరకు ఆడిన నబీ, విజయానికి 16 పరుగులు అవసరమైనపుడు షమీ మొదటి బంతిని నేలబారుగా ఫోర్ కొట్టాడు. రెండు బంతుల తర్వాత లాంగాన్ లో పాండ్యాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత షమీ వరుసగా రెండు బంతుల్లో ఆఫ్తాబ్ ఆలమ్, ముజీబుర్ రెహ్మాన్ లను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.