వరల్డ్‌ కప్‌: వణికిపోతోన్న కివీస్..!

వరల్డ్‌ కప్‌: వణికిపోతోన్న కివీస్..!

ఐసీసీ వరల్డ్ కప్‌ 2019 మెగా ఈవెంట్‌లో భాగంగా ఇవాళ తొలి సెమీస్‌లో టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్ జట్టు సిద్ధమవుతోంది... లీగ్ దశలోనే ఈ రెండు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగాల్సి ఉన్నా అది వర్షం కారణంగా రద్దైపోయింది.. దీంతో ఇరు జట్లుకు చెరో పాయింట్ దక్కింది. అయితే, ఇప్పుడు సెమీస్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచిఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అసలే లీగ్ దశలో బాగా రాణించి.. సెమీస్ లో చేతుతెల్తేయడం ఆ జట్టుకు పరిపాటిగా మారగా.. అందని ద్రాక్షలా ఉన్న కప్‌ను ఈ సారైనా కొట్టుకుపోవాలనే పట్టుదలతో ఉంది. కాగా మెగా టోర్నీలో ఆ మధ్య కొన్ని మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడు తర్వాత జోరు తగ్గించాడు. పోటీని రసవత్తరంగా మార్చేశాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సెమీస్‌ పోరు వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం మాంచెస్టర్‌ మేఘావృతమైంది. ఆకాశంలో నీలి మబ్బులు కమ్ముకున్నాయి. మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా. ఇవాళ కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సెమీస్‌ సవ్యంగా సాగుతుందా లేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటంటే..! మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగితే.. మరుసటి రోజు మ్యాచ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజున కూడా వర్షం వచ్చేందుకు 60 శాతం అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. దీంతో కివీస్ జట్టు వరుణుడిని వేడుకుంటుంది. ఎందుకంటే? రెండు రోజులు వర్షం కురిసి మ్యాచ్‌ ఫలితం తేలకుంటే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. లీగ్‌ దశలో 8 మ్యాచుల్లో ఏడు గెలిచి 15 పాయింట్లతో టాప్ స్పాట్‌లో ఉంది కోహ్లీ సేన.. కానీ, 11  పాయింట్లతో కివీస్ జట్టు నాల్గో స్థానంలో ఉంది. కివీస్‌తో లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దాంతో రెండు జట్లకు చెరో పాయింటు పంచారు. ఇప్పుడు మళ్లీ వీరి మ్యాచ్‌కే వరుణుడు అడ్డుపడడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలకం కానుంది.