ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్‌ వ్యాక్సినేషన్‌.. ఇది మనకే సొతం..!

 ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్‌ వ్యాక్సినేషన్‌.. ఇది మనకే సొతం..!

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇవాళ భారత్‌లో ప్రారంభం కాబోతోంది... దేశ వ్యాప్తంగా మొత్తం 3,006 కేంద్రాలలో టీకాలు వేసే కార్యక్రమం ఇవాళే ప్రారంభం కానుంది.. ఈ కార్యక్రమం అమలయ్యేకొద్దీ, టీకాలు వేసే కేంద్రాల సంఖ్య 5 వేలకు పైగానే పెరిగే అవకాశం ఉంది.. దేశంలో మొత్తం 12 నగరాలకు ఇప్పటికే చేరుకున్న కరోనా వాక్సిన్ తరలించారు.. వాక్సిన్ నిల్వలు, వాటి ఉష్ణోగ్రతలు, “టీకా” తీసుకున్న వారి ఖచ్చితమైన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకుగాను “కోవిన్” అనే యాప్ ను రూపొందించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వాక్సిన్ సరఫరాకు సంబంధించి 24 గంటలు సమాచారం అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 1075 నెంబరు తో “హాట్ లైన్” ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ఉదయం 10.30 గంటలకు దేశ వ్యాప్తంగా వాక్సిన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. 

ఇక, ప్రతి కేంద్రంలోనూ 100 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఇవాళ వ్యాక్సిన్‌ అందించనున్నారు.. వచ్చే కొద్ది వారాలలో కోటి మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి అందనుంది ఈ వ్యాక్సిన్‌.. గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులకు వాక్సిన్ ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఇంజక్షన్లు, ఔషధాలు తీసుకుంటే, అలర్జీ వచ్చే వాళ్లకు కూడా వాక్సిన్ ఇవ్వరాదని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. వాక్సిన్ తీసుకుంటే జరుగుతున్న వైద్య చికిత్స నిలుపుదల చేయాలనే నిబంధన ఉంటే కూడా వాక్సిన్ తీసుకోరాదని స్పష్టం చేసింది. మొత్తంగా ప్రపంచంలో ఏ దేశంలో జరగని విధంగా భారత్‌లో ఈ వ్యాక్సినేషన్‌ జరగబోతోంది. వ్యాక్సిన్‌ పంపిణీలోనూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉన్నసంగతి తెలిసిందే.