నిన్న సీఆర్పీఎఫ్ లేకుంటే...

నిన్న సీఆర్పీఎఫ్ లేకుంటే...

నిన్న సీఆర్పీఎఫ్ లేకుంటే తను అక్కడి నుంచి క్షేమంగా బయటపడేవాడిని కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తన అదృష్టం కొద్దీ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. నిన్నటి ఘటనలపై కలకత్తా హైకోర్ట్, సుప్రీంకోర్టులతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిన్న కోల్ కతాలో తన రోడ్ షోలో జరిగిన హింసపై షా బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆయన నిప్పులు చెరిగారు. నిన్న బెంగాల్ లో జరిగిన ఘటనలపై వాస్తవాలు వివరించేందుకు ముందుకొచ్చానని షా అన్నారు. 

దేశంలో ఎక్కడా హింస జరగలేదని, కేవలం బెంగాల్ లోనే ఎందుకు చెలరేగుతోందని అమిత్ షా ప్రశ్నించారు. 'మీరు బెంగాల్ లోని కేవలం 42 స్థానాల్లోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. ఎక్కడా హింసాకాండ జరగలేదు. ఒక్క బెంగాల్ లోని ప్రతి దశలో హింస చెలరేగింది. దీని అర్థం టీఎంసీయే హింసకు పాల్పడుతోందని' అమిత్ షా అన్నారు. 'ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేశామని ఆరోపిస్తున్నారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ఉన్న ప్రదేశం గదుల లోపల ఉంది. కాలేజ్ మూసి ఉంది. అన్నిచోట్లా తాళాలు వేసి ఉన్నాయి. ఎవరు గదులు తెరిచారు? తాళాలు కూడా బద్దలు కాలేదు. తాళంచెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? కాలేజీని టీఎంసీ కబ్జా చేసింది. మమతా బెనర్జీ కార్యకర్తలే విగ్రహం ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలు బయటే ఉన్నారని' ఆయన వివరించారు.