యాదాద్రి, భద్రాద్రి ఆలయాల్లో సరికొత్త ప్రసాదం

యాదాద్రి, భద్రాద్రి ఆలయాల్లో సరికొత్త ప్రసాదం

యాదాద్రి, భద్రాద్రి ఆలయాల్లో భక్తులకు ఇవాళ్టి నుంచి బెల్లం లడ్డూలను విక్రయించనున్నారు. యాదాద్రిలో ప్రస్తుతం 100 గ్రాముల చక్కెర లడ్డూను రూ. 20 విక్రయిస్తుండగా.. బెల్లం లడ్డూను రూ. 25 కు విక్రయించనున్నారు. తెల్ల బెల్లం(చెరుకు బెల్లం)తో 80, 100 గ్రాముల బరువు కలిగిన లడ్డూలను  ఐదుగురు ఏఈవోలు, ఇద్దరు ప్రధాన పూజారులు, మరో ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులతో ఏర్పాటైన కమిటీ పర్యవేక్షణలో తయారు చేశారు. అందులో వాడిన దినుసులు, పాకం తయారీ తీరు, సమయం వివరాలన్నింటితో కమిటీ రూపొందించిన నివేదికను పరిశీలించి విక్రయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామని ఆలయ ఈవో గీతా రెడ్డి చెప్పారు. 

భద్రాద్రిలో కూడా ఇవాళ్లి నుంచి బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని విక్రయించనున్నట్టు ఈవో రమేష్‌బాబు తెలిపారు. బెల్లం లడ్డూ 100 గ్రాముల ధర రూ.20లు, బెల్లం రవ్వకేసరి 100 గ్రాములు రూ.10, బెల్లం పొంగలి 100 గ్రాములు రూ.10లకు అందిస్తామన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి సన్నిధానంలో బెల్లం పానకంతో తయారు చేసిన లడ్డూల విక్రయాన్ని నిన్నటి నుంచి ప్రారంభించారు. ఆయా ఆలయాల్లో బెల్లంతో లడ్డూలు తయారు చేసి విక్రయాలు ప్రారంభించినా చక్కెర లడ్డూలు కూడా అందుబాటులో ఉంటాయి.