రివ్యూ: యాత్ర
సంగీతం: కృష్ణ కుమార్
సినిమాటోగ్రఫీ: సత్య సూర్యన్
నిర్మాత: విజయ్ చిల్లా, శశి దేవిరెపేడ్డి
దర్శకత్వం: మహి వి రాఘవ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆయన జీవితంతో పాటు తెలుగు రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రను ఆధారంగా చేసుకుని దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) ఎన్నికలకు సిద్ధమయ్యే పనుల్లో భాగంగా మైఖ్యమైన అనుచరులతో సమావేశాలు జరుపుతుంటాడు. అధిష్టానానికి వ్యతిరేకంగా సుచరితకు సీటు కేటాయిస్తాడు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైకమాండ్ అనుమతులు రాకుండానే పాదయాత్ర మొదలుపెడతాడు. అసలు ఆయనకు పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ? అది ఎలా సాగింది ? దాని ద్వారా ఆయన తెలుసుకున్న ప్రజల కష్టాలు ఏమిటి ? ఆ యాత్ర ఆయనలో తెచ్చిన మార్పులేంటి? ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఎలా ఎదిగాడు ? సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయాడు ? అనేదే సినిమా.
విశ్లేషణ:
సినిమా ప్రధానంగా వైఎస్ చేపట్టిన పాదయాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ యాత్ర విశేషాలు చాలా వరకు అందరికీ తెలిసినవే అయినా వాటికి సినిమాటిక్ టచ్ ఇచ్చి మహి వి రాఘవ్ సినిమాను డీల్ చేసిన విధానం బాగుంది. పాదయాత్ర చేసేలా రాజశేఖర్ రెడ్డిని ప్రేరేపించిన పరిస్థితిల్ని చక్కగా చూపించారు. యాత్ర ఆరంభంలో జనం నుండి పెద్దగా స్పందన రాకపోవడం, మెల్లగా ప్రజాదరణ ఊపందుకోవడం వంటి అంశాలు బాగా ఎలివేట్ అయి వైఎస్ అభిమానుల చేత చప్పట్లు కొట్టిస్తాయి.
రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వంపై పాదయాత్ర ప్రభావం ఎంత మేర పనిచేసింది, అన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిష్ఠించాడో చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ వీర విధేయుడు అనే పేరుంది. కానీ సినిమాలో హీరాయిక్ సెన్స్ కోసం అనేక సందర్భాల్లో ఆయన హైకమాండ్ మాటను ధిక్కరిస్తూ తన ధోరణిలోనే నడుచుకున్నట్టు చూపించారు. సినిమా ముగింపు అప్పట్లో జరిగిన వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉండటం మెచ్చుకోదగిన అంశం. విరామం వరకు సినిమా నెమ్మదిగానే నడిపిన దర్శకుడు కథనంలో కొంచెం వేగం ప్రదర్శించి ఉంటే బాగుండేది.
నటీనటుల పనితీరు :
మొదట్లో సినిమాకు మమ్ముట్టిని తీసుకున్నప్పుడు పర భాషా నటుడు ఎలా చేస్తాడో ఏమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ మమ్ముట్టి అద్భుతమైన నటనతో వైఎస్ పాత్రకు ప్రాణం పోశాడు. ఆహార్యంలో రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేశాడు. తెలుగు రాకపోయినా నేర్చుకుని డబ్బింగ్ చెప్పిన ఆయన నిబద్దతను మెచ్చుకోవచ్చు. ఇక రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, సుచరిత పాత్రలో అనసూయ, కెవిపి రామచంద్రరావు పాత్రలో రావు రమేష్ చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు మహి వి రాఘవ్ వైఎస్ఆర్ పాదయాత్రను కళ్ళకు కట్టే ప్రయత్నంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు, ప్రస్తావించిన అంశాలు అకట్టుకున్నాయి. కానీ కొన్ని ముఖ్యమైన అంశాలకి సినిమాటిక్ టచ్ తగ్గించి ఉంటే ఒరిజినాలిటీ మైంటైన్ అయ్యేది. కథనాన్ని ఇంకొంత వేగవంతంగా నడిపి ఉండాల్సింది. సత్య సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కృష్ణ కుమార్ నేపథ్య సంగీతం సినిమాకు బాగా తోడ్పడింది. నిర్మాతలు కూడా వెనుకాడకుండా సినిమాకు కావాల్సిన అన్ని వనరుల్ని అందించి క్వాలిటీ అవుట్ ఫుట్ వచ్చేందుకు సహకరించారు.
పాజిటివ్ పాయింట్స్ :
మమ్ముట్టి నటన
పాదయాత్ర సన్నివేశాలు
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా సాగిన కథనం
కొంత ఎక్కువైన నాటకీయత
చివరిగా : అభిమానుల చేత చప్పట్లు కొట్టిస్తుంది
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)