వైసీపీ ఏకగ్రీవాలకు సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారా...?

వైసీపీ ఏకగ్రీవాలకు సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారా...?

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల పరిస్థితి తయారైందట. ఏకగ్రీవం మాట ఎత్తితే పార్టీ కేడర్‌ కొన్నిచోట్ల బుసలు కొడుతోందట. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతున్నట్టు సమాచారం. ఆ గొడవలేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఏకగ్రీవాలకు వైసీపీ కేడర్‌ నుంచే అడ్డంకులు!

ఏపీ పంచాయతీ ఎన్నికల సమరంలోకి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన అధికార వైసీపీ.. ఏకగ్రీవాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయంగా లోకల్‌ పరిస్థితులు వేడెక్కుతున్నా.. ఏకగ్రీవాల కోసం అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావట. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో వారికి చుక్కలు కనిపిస్తున్నాయట. చాలా చోట్ల వైసీపీ కేడరే అడ్డంకులు కల్పిస్తున్నట్టు సమాచారం. 

ఏకగ్రీవాలైతే ఎన్నికల రాబడి రాదన్నది కొందరి ఆలోచన?

పోలింగ్‌ జరగకుండా ఏకగ్రీవం అయితే..  తమకు ఎలాంటి లాభం ఉండదని ద్వితీయ, క్షేత్రస్థాయి వైసీపీ నేతలు  ఆందోళనతో ఉన్నారట. ఎన్నికలంటేనే గ్రామస్థాయిలో కనీసం పది లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు అవుతుంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ మొదలుకొని.. రోజువారీ ఖర్చులు.. మద్యం పంపిణీ.. ప్రచార ఖర్చులు ఒకటేమిటి ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటిల్లో కొంత మేరకైనా వెనకేసుకోవచ్చన్నది  చాలా మంది ఆలోచనగా ఉందట. అలాంటిది ఏకగ్రీవాలు జరిగిపోతే తమకు రావాల్సిన ఎన్నికల రాబడి ఎలా అని గుర్రుగా ఉన్నారట పార్టీ శ్రేణులు. 

కేడర్‌ తీరు చూసి ఆశ్చర్యపోతున్న వైసీపీ నేతలు!

ఈ సందర్భంగా.. తెర వెనక ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బరిలో ఉండాల్సిందిగా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులే ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కొందరు లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటుంటే.. ఇంకొందరు మాటలతో రెచ్చగొడుతున్నారట. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ తరహా వ్యవహారాలు సాగుతున్నట్టు అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అధికార పార్టీ నేతలు.. వార్నీ అని ఆశ్చర్యపోతున్నారట. ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇస్తూనే.. సొంత పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు.. బుజ్జగించేందుకు ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారట. ఏకగ్రీవాలు అయితే ఖర్చులు తగ్గుతాయని ఆశించిన నాయకులు.. ఇప్పుడు ఎదురు బొక్క పడుతోందని నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారట. 

బరిలో ఉండేందుకు ముగ్గురు నలుగురు పోటీ!

విజయనగరం జిల్లా వైసీపీ నేతలకు మరో కష్టం వచ్చిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో గ్రామస్థాయిలో చాలా మంది పంచాయతీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారట. పోటీ చేసేందుకు ముగ్గురు, నలుగురు వైసీపీ నేతలే పోటీ పడుతుండటంతో.. అక్కడ సర్దుబాటు చేయడం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్ల కావడం లేదట. ఈసారికి వెనక్కి తగ్గాలని బుజ్జగిస్తున్నా.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నాం.. ఎందుకు తగ్గుతాం అని నాయకులనే నిలదీస్తున్నారట. రెబల్‌గా బరిలో దిగేందుకు కూడా వెనకాడటం లేదని సమాచారం. ఈ పరిణామాలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. 

గెలిచాక వచ్చి కలవాలంటోన్న ఎమ్మెల్యేలు!

ఇరకాటంలో పడుతున్న ఎమ్మెల్యేలు మాత్రం.. రాజీ కుదిర్చే బాధ్యత స్థానిక నాయకులకు అప్పగించి.. గెలిచిన వాళ్లు వచ్చి కలవాలని చెబుతున్నారట. ఒకవైపు పార్టీ అధిష్ఠానం నుంచి ఏకగ్రీవాలపై ఒత్తిడి.. ఇటు చూస్తే కేడర్‌ మాట వినకపోవడంతో ముందు నుయ్యి వెనక గొయ్యిలా తమ పరిస్థితి మారిందని వాపోతున్నారట కొందరు ఎమ్మెల్యేలు. శాసనసభ్యుడిగా గెలవడం కంటే.. పంచాయతీలలో పార్టీ కేడర్‌ పోరు తీర్చడం చాలా కష్టమని తలపట్టుకుంటున్నారట. ఇదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.