బాబు పాలనపై వైసీపీ ఛార్జిషీట్

బాబు పాలనపై వైసీపీ ఛార్జిషీట్

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీట్ విడుదల చేసింది... ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ... ఈ సందర్భంగా పథకాల అమలు తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. వ్యవసాయ రుణాల మాఫీ పై సంతకం చేశానని ఓ ఫైల్ తో చేయెత్తాడు.... అవేవి ఆచరణలో జరగలేదని విమర్శించారు. రూ. 82 వేల కోట్ల రుణాలుంటే వాటిని...‌ కోటయ్య కమిటీ సిఫార్సులను పక్కన‌బెట్టి... సొంత కమిటీలతో కేవలం రూ. 24 వేల కోట్లు మాత్రమే రుణాలున్నాయడం‌ సిగ్గుచేటని మండిపడ్డారు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. రూ. 24 వేల కోట్లలో కూడా కేవలం రూ. 13 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. 

రెయిన్ గన్‌లతో వ్యవసాయం అంటూ రూ. 127 కోట్లు ఖర్చు పెట్టావ్... కానీ, కనీసం 127 ఎకరాల్లో‌ కూడా వాటితో వ్యవసాయం జరగలేదన్నారు ఉమ్మారెడ్డి. స్వామి నాథన్ కమిటీ సిఫార్సులను బుట్ట దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు మూసేస్తామన్న చంద్రబాబు... వాటి సంఖ్య రెండింతలు చేశారని ఆరోపించారు. హైవేలపై రోడ్లమీదున్న బెల్ట్ షాపులను తీసేయకుండా అవి స్థానిక రోడ్లంటూ సుప్రీంకోర్టు తీర్పును అవహేళన చేశారని మండిపడ్డారు. ఇక నవ్యాంధ్ర రాజధానిని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేసిన ఉమ్మారెడ్డి... నాలుగు భవనాలను నాలుగేళ్లలో తాత్కాలికంగా నిర్మించి... పక్కా భవనాల నిర్మాణం పక్కదారి పట్టించారని విమర్శించారు. ఐదేళ్లలో ప్రతి జిల్లాకు ప్రత్యేక హామీలిచ్చి మోసం చేశారని... అందులో 10 శాతం కూడా అమలు చేయలేదు... 10 శాతం చేసుంటే చంద్రబాబుకు సెల్యూట్ చేసేవాళ్లమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం నాలుగేళ్లు చేసి ఒట్టి చేతులతో తిరిగొచ్చాడంటూ సెటైర్లు వేసిన ఉమ్మారెడ్డి... అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కాలయాపన చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం చేపడుతానంటే... ఏరికోరి తెచ్చుకున్న చంద్రబాబు... పోలవరం‌ పనులను పూర్తికాకుండా చేశారని మండిపడ్డారు. ఇక సింగపూర్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ఏపీ సీఎం చంద్రబాబు... అంతర్జాతీయ కోర్టులకు వెళ్లాల్సి వస్తుందన్నా వైసీపీ నేతలు.