తొలిరోజే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తాం..

తొలిరోజే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తాం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను పార‍్టీలకు అతీతంగా అందిస్తామని, అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. మీ అమూల్యమైన ఓటు వేసి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమశంకర్‌ గణేష్‌, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సత్యవతిని గెలిపించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.  

‘పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల నడిచాను. 13 జిల్లాల ప్రజల కష్టాలు విన్నాను. ప్రతి కుటుంబం పడుతున్న బాధను కళ్లారా చూశాను. నాడు హోరున వర్షంలో పాదయాత్రలో వెంట నడిచారు. ఇవాళ మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలి వచ్చారు. నర్సీపట్నంలో మీ అందరి మధ్య ఈరోజు వైసీపీకి ఓటు వేయండి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి అని అడిగే ముందు...మాకు అధికారం ఇస్తే....ఏం చేయదలచుకున్నామో చెబుతాను. ఆదుకోవాల్సిన 108 సకాలంలో రావడం లేదు. ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవు. 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. ఉద్యోగాలిస్తామని చెప్పి... ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలను చూశాను. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పిల్లలను చూశాను. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశాను. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తాం. వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తాం. గిట్టుబాటు ధరలు ఇస్తాం. అయిదేళ్లలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తా. అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అని నర్సీపట్నం ప్రచార సభలో జగన్ హామీ ఇచ్చారు.