ఉండి వైసీపీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు !

ఉండి వైసీపీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు !

పశ్చిమగోదావరిలో జిల్లా వైసీపీ రాజకీయాలు ఓ తీరు అయితే.. ఉండి నియోజకవర్గంలో మరో తీరుగా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఏకంగా రోడ్డెక్కి మరీ  జనాలకు వినోదాన్ని పంచుతున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 
 
వైసీపీ  నేతల మధ్యే ఆరోపణలు, ప్రత్యారోపణలు!

అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అంతటా వైసీపీ గాలి వీస్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలలో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. ఈ రెండు నియోజకవర్గాలలోని టీడీపీ ఎమ్మెల్యేలు అవకాశం చిక్కితే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మరి.. వీరికి కౌంటర్‌ ఇవ్వాల్సిన నియోజకవర్గ నాయకులు పార్టీలోని అంతర్గత పోరుతో సమతం అవుతున్నారు. స్వపక్షంలో విపక్షంగా మారిన వారితో తలపడటానికే వైసీపీ నేతలకు సమయం సరిపోవడం లేదట. పాలకొల్లులో నాయకులు పదవులు ఇచ్చి అక్కడ వైసీపీని స్ట్రాంగ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నా.. ఉండిలో మాత్రం అలా లేదట. అధికార, విపక్ష పార్టీల మధ్య కంటే ఎక్కువగా వైసీపీలోని నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. 
 
వేరే పార్టీల నుంచి  వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణ!

ఉండి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా PVL నరసింహారాజు ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పీవీఎల్‌ వైఖరి నచ్చలేదో.. లేక ఆయనంటే పడటం లేదోకానీ.. గ్రామాల్లో మాత్రం ఇంఛార్జ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి అద్దం పడుతున్నాయి. వైసీపీలో ముందు నుంచి ఉన్నవారికి కాకుండా.. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని  పీవీఎల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైనే మండల, గ్రామస్థాయి నాయకులు రుసరుసలాడుతున్నారు. అయితే ఇన్నాళ్లూ గుంభనంగా.. అంతర్గత చర్చకు, ఆవేశాలకు పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు రచ్చకెక్కింది. ఉండి వైసీపీలో రచ్చ రచ్చ అవుతోంది. 
 
వర్మకు మరికొందరు నేతలు జత!

నరసింహారాజు వైఖరి నిరసనగా వైసీపీలో తనకెలాంటి ప్రాధాన్యం లేదని గొల్లలకోడేరుకు చెందిన గ్రామ కన్వీనర్‌ శ్రీనివాసవర్మ ఇంటిలోనే దీక్షకు దిగడం పార్టీలో కలకలం రేపింది. టీడీపీ వాళ్లు ఎలాగైనా బతుకుతారు.. వైసీపీ వాళ్లు వైసీపీ కోసమే బతకాలంటూ ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా వేశారు. గ్రామ సచివాలయాల నుంచి కల్యాణ మండపాల నిర్మాణాల వరకూ అన్ని పనులు  వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వర్మ ఆందోళనకు పార్టీలోని మిగతా నాయకులు కూడా జత కలవడంతో ఇది మరింత చర్చకు కారణమైంది. ఆకివీడు, వేండ్ర, వేండ్ర అగ్రహారం గ్రామాలకు చెందిన  నాయకులు మద్దతు తెలియజేయడంతో సమస్య చినికి చినికి గాలివానగా మారిపోయింది. 
 
రూ.70 లక్షలు వర్మ సొంతానికి వాడేసుకున్నారని పీవీఎల్‌ వర్గం ఆరోపణ!

అయితే పీవీఎల్‌ అనుకూల వర్గం మరొకటి తెరపైకి రావడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.  గ్రామాభివృద్ధి కోసం  కోటిన్నర నిధులు ఇస్తే... అందులో 70 లక్షల రూపాయలను  శ్రీనివాసవర్మ సొంతానికి వాడేసుకున్నారని పీవీఎల్‌ వర్గానికి చెందిన  చేకూరి రాజా నరేంద్ర వర్మ ఆరోపించారు. ఈ ఆరోపణలు.. విమర్శలు చూసిన  జనం.. ప్రతిపక్ష పార్టీలు ఆశ్చర్యపోతున్నాయట.  అధికార పార్టీ నేతలు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారా అని నిరసనలకు సిద్ధమవుతున్నారట. మొత్తానికి ఉండి వైసీపీలోని అంతర్గత పోరు.. తెరవెనక యవ్వారాలను రోడ్డున పడేస్తోంది. విషయం తీవ్ర రూపం దాల్చుతుండటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది హైకమాండ్‌.  వర్మ దీక్షను విరమింప చేసే బాధ్యతను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు అప్పగించారు.  సమస్యలు పరిష్కరించుకుందాం అంటూ వర్మ దీక్షను విరమింప చేశారు ఎమ్మెల్యే గ్రంధి. అయితే ఓడినా దారికి రాని  వర్గాలు రోజూ ఏదో ఒక ఆరోపణ చేసుకుంటూ సమస్యను జఠిలం చేస్తున్నాయి. మరి ఈ సమస్య ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.