ఏపీ అసెంబ్లీః 'బంట్రోతు' దుమారం

ఏపీ అసెంబ్లీః 'బంట్రోతు' దుమారం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ రెండో రోజే అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. స్పీకర్‌గా తమ్మినే సీతారం ఎన్నిక తరువాత అభినందన తీర్మానంపై  జరిగిన చర్చ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఉద్దేశించి చేసిన  వ్యాఖ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. స్పీకర్‌ ఆస్థానంలో తమ్మినేని సీతారాం కూర్చోబెట్టడానికి విపక్షం తరఫున చంద్రబాబు బంట్రోతు అచ్చెన్నాయుడు వచ్చాడని చెవిరెడ్డి అన్నారు. దీనిపై అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేను బంట్రోతుగా సంబోధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ... తాము ఎమ్మెల్యేలమో... బంట్రోతులమో చెప్పాలని అచ్చెన్నాయుడు స్పీకర్‌ను కోరారు. ఒకవేళ తాను చంద్రబాబుకు బంట్రోతునైతే... అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి జగన్‌కు బంట్రోతులేనా.. ఆ విషయం స్పష్టం చేయాలని అన్నారు. ఈ విషయంలో స్పీకర్‌ రికార్డులను చూసి చర్య తీసుకుంటానని అన్నారు. ఈలోగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈలోగా  విపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ... స్పీకర్‌ ఎన్నికైన ఇవాళ ... ఈ విషయమై ఎంత మాత్రం వివాదాస్పదం చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ విషయంపై నిర్ణయం స్పీకర్‌కు వొదిలేయాలని ఆయన అన్నారు. దీనిపై రికార్డులు చూసి రూలింగ్‌ ఇస్తానని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు.