రోడ్లపై నాట్లు వేసిన ఎమ్మెల్యే రోజా

రోడ్లపై నాట్లు వేసిన ఎమ్మెల్యే రోజా

ఏపీలోని రోడ్ల పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలపడం కోసం వైసీపీ ఎమ్మెల్యే రోజా వినూత్నంగా నిరసనను తెలిపారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లపై రోజా నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రోజాకు తెలిపారు. ఈ రోజు రోజా చిత్తూరు జిల్లా మేళపట్టు గ్రామానికి చేరుకుని బురదమయంగా మారిన రోడ్లపై నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

అనంతరం వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... టీడీపీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో రహదారులు అన్ని దారుణంగా ఉంటే.. మంత్రి లోకేష్‌ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని రోజా మండిపడ్డారు.