మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె తన వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే ప్రధమ చికిత్స చేశారు. ఆమే తాడికొండ శాసన సభ్యురాలు డాక్టర్ ఎం శ్రీదేవి. ఈ ఉదయం ఆమె విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా పెద్ద కాకాని వద్ద ఓ ప్రమాదం జరిగింది.

అనుకోకుండా టైర్ పగిలిన బైక్ ను వెనకనుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్వతహాగా వైద్యురాలయిన శ్రీదేవి హుటాహుటిన తన వాహనంలో నుంచి దిగి పరుగుపరుగున గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేంత వరకూ శ్రీదేవి అక్కడే ఉన్నారు.

అంబులెన్స్ వచ్చిన వెంటనే స్థానికులు ఆ వ్యక్తిని అంబులెన్స్ లోకి ఎక్కించారు.అంబులెన్స్ లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో శ్రీదేవి క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. తలకు గాయాలైనందున ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా అంబులెన్స్ డ్రైవర్ కి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన పని కాదనుకోకుండా మానవత్వంతో ప్రాణాలు కాపాడిన ఆమె మీద ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.