ప్రజల్లోకి వెళ్లాలంటే భయంగా ఉందన్న వైసీపీ ఎమ్మెల్యేలు

ప్రజల్లోకి వెళ్లాలంటే భయంగా ఉందన్న వైసీపీ ఎమ్మెల్యేలు

సమస్యలు పరిష్కరించండి...ఈ పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే భయంగా ఉందంటూ విశాఖలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల మొర పెట్టుకోవడం సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతానికి ఇది విశాఖ ఎమ్మెల్యేలు బయట పడ్డారు కాబట్టి ఆ జిల్లాకి మాత్రమే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏపీ మొత్తం ప్రజాప్రతినిధుల భావన అదే కాకుంటే విశాఖ ఎమ్మెల్యేలు బయటపడ్డారు. విశాఖ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిన్న కలెక్టరేట్‌లో సమీక్షించారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, బి.మాధవి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, అదీప్‌ రాజ్‌, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, శెట్టి ఫల్గుణ, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, సీపీ ఆర్‌కె మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ నగరం సహా జిల్లాలోని పరిస్థితులపై ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారని, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని ఈ సమావేశంలో కోరారు.