పార్టీ ఆదేశిస్తేనే గాజువాక వెళ్లా..

పార్టీ ఆదేశిస్తేనే గాజువాక వెళ్లా..

ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ సాధించిన విజయం హిస్టారికల్ విక్టరీగా అభివర్ణించారు సినీ హీరో, వైసీపీ నాయకుడు రాజశేఖర్. ఈ చారిత్రక విజయంలో మేము ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉండి పెద్ద విజయం అందించామని గుర్తు చేశారు. 'నేను దాదాపు 8 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. పసుపు కుంకుమ వల్లే మహిళలు రాత్రి ఒంటి గంట వరకు ఉండి ఓటు వేసి వెళ్లారని టీడీపీ వాళ్లు చెప్పారు. ఫలితాలను చూసి ఎగ్జైట్ కాలేదు. నాకు ముందే తెలుసు.. జగన్ వేవ్ ఉందని ముందే చెప్పా. ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ తో ఉన్న మిస్ అండర్ స్టాండింగ్ ను తొలగించుకున్నాం. నాగబాబు మూవీ ఆర్టీస్ అసోసియేషన్ ఎన్నికల్లో మాకు సపోర్టు చేశారు. గాజువాక వెళ్లాం. భీమవరం వెళ్లలేదు. గాజువాకకు కూడా పార్టీ ఆదేశిస్తేనే వెళ్లా తప్పితే.. కావాలని ప్రచారానికి వెళ్లలేదు. ప్రజారాజ్యంలో నాకు చిరంజీవికి ఉన్న మనస్పర్థలు పోవడానికి ఇన్ని రోజులు పట్టింది' అని రాజశేఖర్ అన్నారు.

జీవిత రాజశేఖర్ ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందే పార్టీలో చేరారు. ఆ త‌ర్వాత 10, 15 రోజుల పాటు గాజువాక, గన్నవరం, నందిగామ, భీమవరం, విజయవాడ తదితర నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. వీళ్లు ప్రచారం చేసిన చాలా చోట్ల అభ్యర్థులు గెలుపొందారు. దాంతో వాళ్లు త‌మ క‌ష్టానికి త‌గిన ప్రతిఫ‌లం ద‌క్కింద‌ని సంతోష‌ప‌డుతున్నారు. పైగా ఇన్ని రోజుల‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల‌కు కోరుకున్న మంచి నాయ‌కుడు వ‌చ్చాడ‌ని.. ఇన్నాళ్లకు జ‌గ‌న్ రూపంలో అస‌లైన నాయ‌కుడు ఎలా ఉంటాడో చూపించ‌బోతున్నార‌ని తెలిపారు. ఆయ‌న పాల‌న‌లో ప్రజ‌లు మ‌రింత సంతోషంగా ఉంటార‌ని న‌మ్ముతున్నట్లు ఆశించారు జీవితా రాజ‌శేఖ‌ర్. ఏపీకి జగన్ ప్రత్యేక హోదా తీసుకు వస్తారని మేం బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.