స్వార్థ ప్రయోజనాల కోసమే హత్యాయత్నం

స్వార్థ ప్రయోజనాల కోసమే హత్యాయత్నం

వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేతపై జరిగిన దాడి నేపధ్యంలో పార్టీ సీనియర్ నేతలు లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. విశాఖలో జగన్ పై జరిగిన దాడి, ప్రభుత్వం స్పందించిన తీరు తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. అనంతరం భూమన కరుణాకర్‌ రెడ్డి, అంబటిరాంబాబు, పార్ధసారథిలు మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తమ అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేశారని భూమన వ్యాఖ్యానించారు. ఈ దాడి పట్ల డీజీపీ, టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వతంత్ర విచారణ సంస్థతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, గవర్నర్‌లు కలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా నేరచరిత్రేనని, తమ పార్టీపై బురద జల్లేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మండిపడ్డారు. 

ఏపీ పోలీసులను వైఎస్‌ జగన్‌ అవమానించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పార్థసారథి స్పష్టం చేశారు. తాము తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదన్నారు.  దేన్నైనా చంద్రబాబు మసిపూసి మారేడు చేస్తారని మరోనేత అంబటి రాంబాబు అన్నారు. అందుకే తాము స్థానిక దర్యాప్తును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ముద్దాయిలను కాపాడటానికే చంద్రబాబు, డీజీపీలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.