బలనిరూపణకు 15 రోజులు గడువు

బలనిరూపణకు 15 రోజులు గడువు

కర్ణాటకలో నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ బలనిరూపణకు గవర్నర్‌ 15 రోజులు గడువిచ్చారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న యడ్యూరప్ప.. ఈ లోగా విశ్వాస పరీక్షను ఎదుర్కొంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తారు.  222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 104 నియోజకవర్గాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ నెంబర్ 112కు ఏడుగురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. మరోవైపు.. బలనిరూపణకు  15 రోజుల గడువు ఇవ్వడం అన్యాయమని జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గవర్నర్ నిర్ణయం వల్ల బీజేపీ అనైతిక చర్యలకు దిగే ప్రమాదం ఉందని కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. మే 23వరకు బలనిరూపణ చేసుకునేందుకు అవకాశం ఉండడంతో సంఖ్యా బలాన్ని పెంచుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అలాగే.. అటు కాంగ్రెస్, జేడీఎస్‌లు రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని  రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి.