వాయనాడ్ లోక్ సభ స్థానంలో 45% ముస్లింలే!!

వాయనాడ్ లోక్ సభ స్థానంలో 45% ముస్లింలే!!

కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేయనుండటంతో వార్తల్లోకెక్కింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ సీట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పదేళ్ల క్రితమే ఏర్పడిన వాయనాడ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లను ఒడిసి పట్టేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించనుంది.

అమేథీలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్ గాంధీ సురక్షితమైన సీటు వెతుక్కొని పారిపోతున్నారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే మహారాష్ట్రలోని వార్ధాలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమేథీలో హిందువుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న భయంతోనే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చాలా మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు కూడా హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్నందుకే రాహుల్ వాయనాడ్ ను రెండో సీటుగా ఎంచుకున్నారని అభిప్రాయపడ్డారు.

అయితే కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది దీనిపై వివరణ ఇస్తూ జనాభా లెక్కల ప్రకారం వాయనాడ్ జిల్లాలో హిందువులు 49.48 శాతం ఉండగా ముస్లింలు 28.65 శాతమే ఉన్నారని చెప్పారు. చాలా మంది కాంగ్రెస్ మద్దతుదారులు కూడా వాయనాడ్ జనాభా లెక్కలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. కానీ ప్రధాని మోడీ ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తున్నారు.  దీంతో వాయనాడ్ లోక్ సభ స్థానంలో మతపరమైన జనాభా లెక్కలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది.

ప్రియాంక చతుర్వేది వాయనాడ్ జిల్లా వరకు సరైన మతపరమైన జనాభా లెక్కలనే చూపారు. కానీ అది రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ లోక్ సభ స్థానంలో ఒక్క భాగం మాత్రమే. లోక్ సభ స్థానాలకు సంబంధించి అధికారిక మతపరమైన జనాభా లెక్కలేవీ లేవు. ఎందుకంటే జనాభా లెక్కలను గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాలవారీగా తీస్తారు తప్ప లోక్ సభ స్థానాలవారీగా కాదు. ఇక వాయనాడ్ విషయానికొస్తే ఇందులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి వాయనాడ్ జిల్లాలోని మనంతవాది, సుల్తాన్ బెతరీ, కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎర్నాడ్, నీలంబూర్, వండూర్.

వీటిలో మలప్పురం జిల్లా దేశంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ ముస్లింలు 70 శాతం కంటే ఎక్కువగా నివసిస్తున్నారు. మలప్పురంలోని ఒక తాలూకా అయిన నీలాంబుర్ లో 57.8 శాతం ముస్లిం జనాభా ఉంది. హిందువులు, క్రిస్టియన్ల జనాభా ఇక్కడ 33.5 శాతం, 8.5 శాతం మాత్రమే. వాయనాడ్ జిల్లా మిగతా మూడు సీట్లైన మనంతవాది, సుల్తాన్ బేతరీ, కల్పెట్టలలో హిందువులు 48.5 శాతం కాగా ముస్లింలు, క్రిస్టియన్లు 28.7 శాతం, 21.3 శాతంగా ఉన్నారు.  

ఇవన్నీ లెక్కలు తీస్తే వాయనాడ్ లోక్ సభ స్థానంలో హిందూ ఓటర్లు 41 శాతం కంటే కాస్త ఎక్కువగా ఉండగా ముస్లింలు 45 శాతానికి కొద్దిగా తక్కువ ఉన్నారు. క్రిస్టియన్ ఓటర్ల సంఖ్య 13 శాతంగా ఉంది. అందువల్ల వాయనాడ్ లోక్ సభ సీటులో హిందువుల కంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు.