ట్రాయ్ కొత్త టారిఫ్ తో 25% పెరగనున్న టీవీ బిల్లు

ట్రాయ్ కొత్త టారిఫ్ తో 25% పెరగనున్న టీవీ బిల్లు

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త టారిఫ్ ఉత్తర్వుల తర్వాత చాలా మంది సబ్ స్క్రైబర్లకు టీవీ చూడటం ఖరీదైన వ్యవహారంగా మారనుంది. అయితే కొత్త ఆదేశాలతో పాపులర్ చానల్స్ కి లాభం కలుగుతుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ లో ఈ విషయాలు తెలియజేసింది.క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, ట్రాయ్ కొత్త మార్గదర్శకాల కింద బ్రాడ్ కాస్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు, చానల్ ధరలు ప్రకటించారు. చాలా మంది టీవీ సబ్ స్క్రైబర్లకు ఇవి నెలవారీ బిల్లుని పెంచనున్నాయి. 

టీవీ యూజర్లకు ఛానెళ్లు ఎంచుకొనడంలో, వాటిపై ఖర్చు చేయడంలో పారదర్శకత, ఏకరూపత తీసుకురావడం ట్రాయ్ ఫ్రేమ్ వర్క్ ఉద్దేశం. కొత్త నియమాలలో కస్టమర్లు తమకి ఇష్టమైన ఛానెళ్లు ఎంచుకొని వాటి ప్రకారం చెల్లించే స్వేచ్ఛ లభిస్తుంది. ఇందుకోసం టీవీ బ్రాడ్ కాస్టర్లకు తమ చానెల్ లేదా బొకేకి గరిష్ఠంగా ఎంత చెల్లించాల్సి వస్తుందో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. 

25% బిల్లు పెరగవచ్చు
కొత్త నియమాల మేరకు ప్రేక్షకుల నెలవారీ టీవీ బిల్లుపై వేర్వేరుగా ప్రభావం చూపనుందని దీనిపై విశ్లేషణ జరిపిన క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ గుప్తా చెప్పారు. పాత ధరలతో పోలిస్తే 10 ఛానెళ్లకు సబ్ స్క్రైబ్ చేసే కస్టమర్ల బిల్లు ప్రస్తుతం నెలకు రూ.230-240గా ఉండగా ఇది 25% పెరిగి రూ.300 కానుంది. కానీ కస్టమర్ 5 ఛానెల్లు లేదా అంత కంటే తక్కువ సబ్ స్క్రైబ్ చేస్తే ఈ బిల్లు బాగా తగ్గుతుంది.

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాల వల్ల పాపులర్ ఛానెళ్లకు ప్రయోజనం కలుగుతుందని క్రిసిల్ చెబుతోంది. దీనివల్ల నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓవర్ ద టాప్ సేవల వైపు ప్రేక్షకులు మళ్లుతారని అంచనా వేసింది. అందువల్ల బ్రాడ్ కాస్టర్స్ పరిశ్రమలో ఏకీకరణలు, విలీనాలు జోరందుకుంటాయని చెప్పింది. ఇకపై ప్రోగ్రామ్ క్వాలిటీకి ప్రాధాన్యత పెరగనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల వల్ల బ్రాడ్ కాస్టర్ల ఆదాయం 40% పెరిగి ప్రతి కస్టమర్ పై రూ. 94కి చేరుతుంది. ప్రస్తుతం ఇది నెలకు రూ.60-70 ప్రతి కస్టమర్ గా ఉంది. కస్టమర్లు ప్రజాదరణ ఉన్న చానెళ్ల వైపు మొగ్గుచూపుతారు కనుక ధరల నిర్ణయంలో పెద్ద బ్రాడ్ కాస్టర్ల మాటే చెల్లుతుంది. ఇక అంతంత మాత్రం ఛానెళ్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. వీటిలో చాలా చానెళ్లు మూతపడక తప్పదు.

డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ వంటి డిస్ట్రిబ్యూటర్లపై ఇది మిశ్రమ ప్రభావం చూపనుంది. వారికి ప్యాకేజింగ్ నుంచి లాభాలు ఉండవు. కానీ ప్రతి కస్టమర్ నుంచి వారికి వచ్చే ఆదాయం స్పష్టంగా తెలుస్తుంది. కొత్త ఫ్రేమ్ వర్క్ వచ్చిన తర్వాత ఓవర్ ద టాప్ ప్లాట్ ఫామ్ బాగా లాభపడుతుందని క్రిసిల్ డైరెక్టర్ నితేష్ జైన్ చెప్పారు. సబ్ స్క్రిప్షన్ ఖర్చులు పెరగడంతో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ ఫామ్ వైపు మళ్లుతారని..తక్కువ డేటా టారిఫ్ లు వారిని సులువుగా ఆకర్షితులను చేస్తాయని విశ్లేషించారు.