యార్లగడ్డకు జగన్ సర్కార్ కీలక పదవి 

యార్లగడ్డకు జగన్ సర్కార్ కీలక పదవి 

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ యార్లగడ్డ ల‌క్ష్మీప్రసాద్‌‌ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఆయన్ని అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఈ సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొన‌సాగనున్నారు. అధికార భాషా సంఘంలో నలుగురు సభ్యులను కూడా నియమించుకునే అవకాశాన్ని యార్లగడ్డకు అందించింది ప్రభుత్వం. ఆచార్య యార్లగడ్డ కేంద్ర ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మశ్రీ పుర‌స్కారాల‌ను అందుకున్నారు. రాజ్యసభ సభ్యులుగానూ పనిచేశారు. కృష్ణా జిల్లా గుడివాడ స‌మీపంలోని వాన‌పాముల‌కు చెందిన యార్లగడ్డ జైఆంధ్రా ఉద్యమంలో కీల‌కంగా వ్యవహరించి జైలు జీవితం కూడా గ‌డిపారు.

దివంగ‌త సీఎం ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఉత్తరాది వారికి తెలుగు సాహిత్యం గొప్పతనం తెలియాలని తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీలోకి అనువదింప‌జేయాల‌ని భావించిన యార్లగడ్డ అష్టావ‌ధానం, శ‌తావ‌ధానం లాంటి ప్రక్రియలను హిందీలోకి అనువ‌దించి వాటికి విశేష ప్రాచుర్యం కల్పించారు. అలానే హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ప‌లు పుస్తకాలను తెలుగులోకి అనువ‌దించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి యార్లగడ్డ బాషా సేవను గుర్తించి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడ‌మీ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆచార్య యార్లగడ్డ కేంద్రీయ హిందీ సంసధ్‌లో స‌భ్యులుగా సేవ‌లు అందిస్తున్నారు, దీనికి ప్రధాని చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.