మట్టి దోపిడీ తప్ప ఏమీ లేదు...

మట్టి దోపిడీ తప్ప ఏమీ లేదు...

నిడదవోలులో మట్టి దోపిడీ తప్ప ఏమీ కనబడటం లేదని ఆరోపించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిదదవోలు గణపతి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... నిడదవోలు పౌరుషానికి, శౌర్యానికి పెట్టింది పేరు... తెలుగవారి పౌరుషానికి, ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచే రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల ఇది... ఆమె భర్త వీరభద్రుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. అటువంటి ఈ గడ్డమీదపై అన్యాయం, అక్రమం, అవినీతి, దోపిడి, పక్షపాతం కనిపిస్తున్నాయని... ఇసుక దోపిడి, మట్టి దోపిడి తప్ప ఇక్కడ ఏమీ కనబడడం లేదని మండిపడ్డారు జగన్. 

పెండ్యాల, ఖండవల్లి, తీపర్రు ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని విమర్శించారు జగన్... ఇక్కడి ఎమ్మెల్యే నుంచి పెదబాబు దాకా అందరికీ ఇసుకలో వాటాలే ఉన్నాయంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన ఆయన... అక్కచెల్లమ్మలను అందరికీ బంగారం మాఫీ, పొదుపు సంఘాల మాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శలు గుప్పించారు జగన్.