రేపు హైదరాబాద్ రానున్న వైఎస్ జగన్ 

రేపు హైదరాబాద్ రానున్న వైఎస్ జగన్ 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ శనివారం హైదరాబాద్ రానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. ఈ సమావేశంలో జగన్‌ను సభా నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యాలయం ఆహ్వానించింది. శాసనసభాపక్ష సమావేశం అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరుతారు. రాజ్ భవన్ చేరుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న వైసీపీ... ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శాసనసభాపక్ష సమావేశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, కేబినెట్‌ ప్రకటనకు అవసరమైన తేదీలను ఖరారు చేసింది. 30న జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మంత్రివర్గాన్ని జగన్‌ ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని ముందునుంచే అంచనా వేస్తున్న జగన్‌... వైసీఎల్పీ సమావేశం, సీఎంగా ప్రమాణస్వీకార తేదీలతోపాటు కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.