చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్...

చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్...

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అనంతపురంలో బెంగళూరు జాతీయ రహదారి పక్కన మైదానంలో నిర్వహించిన సమర శంఖారావ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు నవరత్నాలు కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఎన్నికల వస్తున్నాయన్న కారణంతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డ జగన్.. తాను చెప్పిన ప్రతీ హామీ కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ తడబడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలని ఒకసారి, వద్దని మరోసారి సీఎం తీర్మానాలు చేస్తారంటూ సెటైర్లు వేసిన ఆయన.. నాలుగేళ్లు బీజేపీ, పవన్ కల్యాణ్ తో కలసి కాపురం చేశారు.. వారి కాపురం చూసి చిలుక గోరింక కూడా అసూయపడ్డాయని సెటైర్లు వేశారు. 

ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తారని ఎద్దేవా చేశారు జగన్.. నాలుగన్నరేళ్లు డ్వాక్రా రుణ మాఫీ గురించి పట్టించుకోరు, ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు - కుంకుమ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయకనే.. ఇప్పుడు రైతు సుఖీభవా అంటూ చెవిలో పూలు పెడుతున్నారన్న జగన్... రాజధాని నిర్మాణం గురించి అడిగితే బాహుబలి సెట్టింగులు చూడమంటారని ఎద్దేవా చేశారు. ఆరో బడ్జెట్ పేరుతో సీఎం నాల్గో సినిమా తీశారని వ్యాఖ్యానించిన వైసీపీ అధినేత... చంద్రబాబు మోసపూరిత హామీలను ఎవరూ సమ్మొద్దని పిలుపునిచ్చారు. మూడు నెలల్లో మనం అధికారంలోకి వస్తాం అంత వరకూ నిన్ను నమ్మం బాబు అన్న నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనని బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చి మీ అందరీ మీద ఉందన్న పార్టీ అధినేత.. రాష్ట్రంలో మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం... ఇప్పుడు అక్రమంగా పెట్టిన కేసులను అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇక టీడీపీ అక్రమాలకు పాల్పడితే ఈసీకి ఫిర్యాదు చేయాలని కార్యకర్తలు సూచించారు జగన్.