స్ట్రాంగ్ రూమ్‌లను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలి..!

స్ట్రాంగ్ రూమ్‌లను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలి..!

ఎన్నికల తర్వాత ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసిన జగన్ బృందం.. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, దాడులు, టీడీపీ అభ్యర్థులు పోలింగ్ స్టేషన్లలో వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలపై గవర్నర్ కు వివరించామన్నారు. నిన్న మా ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిందని.. అవే అంశాలపై మేం గవర్నర్‌ను కలిశామన్నారు. శాంతి భద్రతలు మీద ఫిర్యాదు చేశాం, ఎన్నికల రోజు.. ఆ తర్వాత జరిగిన దాడులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాద్.. పోలింగ్‌బూత్ లోకి వెళ్లటం నేరం.. పైగా తలపులు వేసుకుని తనంతట తనే చొక్కాలు చించుకుని హంగామా సృష్టిస్తే... కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గురజాల లాంటి ప్రాంతాల్లో ఓటు వేయలేదనే కారణంతో మైనార్టీలు, ఎస్సీలపై దాడి చేసినా కేసులు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. మా అభ్యర్థి శ్రీవాణి పై టీడీపీ నేతలు దాడి చేసినా ఎందుకు కేసు పెట్టలేదు? అని నిలదీసిన జగన్... తలపట్టులో ఎమ్మెస్ బాబుపై దాడి చేస్తే ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

ఇక మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి ఈవీఎమ్‌లు ఎలా బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు జగన్... అందుకే స్ట్రాంగ్‌ రూమ్‌లను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని... లైవ్ సీసీ కెమెరాలు కేంద్ర ఈసీ పర్యవేక్షణలో ఉంచాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పారా మిలటరీ బలాలను మోహరించాలని సూచించారు. ఒక కులానికి  సంబంధిచిన డీఎస్పీలకు ఏకపక్ష ప్రమోషన్స్ ఇచ్చారని ఆరోపించారు జగన్.. దీంతో వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని.. బాధితులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దిగజారిన శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు జగన్.