రికార్డులు తిరగరాసిన జగన్..

రికార్డులు తిరగరాసిన జగన్..

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ దాదాపు 150 సీట్లలో విజయం వైపు దూసుకెళ్తోంది. వైసీపీ విజయంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి... అయితే, ఈ ఎన్నికల్లో విజయంతో కొత్త రికార్డు సృష్టించారు జగన్. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చి విఫలమైనవారు. రాణిస్తున్నవారు ఉన్నా... వైఎస్ జగన్ కాస్త ప్రత్యేకమే. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా తండ్రులు పనిచేసినా.. వారి కుమారులు ఇప్పటి వరకు సీఎంలు అయిన సందర్భాలు లేవు. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించనున్నారు వైఎస్ జగన్. ఇక వైఎస్  రాజశేఖర్‌రెడ్డి కంటే ముందు అనేక మంది నేతలు ఉమ్మడి ఏపీకి సీఎంలుగా పనిచేశారు. పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మనందరెడ్డి.. సీఎంలుగా పనిచేసినా.. వారి వారసులు... ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా.. మంత్రులుగా పని చేసినా సీఎం స్థాయి వరకు ఎదగలేకపోయారు. కానీ, ఆ సెంటిమెట్లు, పాత రికార్డులు తిరగరాస్తూ.. సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు వైఎస్ జగన్.