రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధానికి వివరించా..

రాష్ట్ర ఆర్థిక  పరిస్థితి ప్రధానికి వివరించా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ప్రధాని నరేంద్రమోడీకి వివరించానని వైసీపీ శాసనసభాపక్షనేత జగన్ తెలిపారు. ఆదివారం ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మోడీకి పూర్తి అవగాహన ఇస్తూ చర్చించానని తెలిపారు. ప్రత్యేక హోదా, ఆ అంశం అవశ్యకతను వివరించానని అన్నారు. దీనికి మోడీ సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఓవర్ డ్రాఫ్ట్ పై ఉందో తెలిపానని అన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి ఏపీ అప్పులు రూ. 97 వేల కోట్లుగా ఉందని అన్నారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అప్పులు రూ. 2లక్షల 57 వేల కోట్లకు చేరాయని తెలిపారు. రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలను ప్రధానికి వివరించానని అన్నారు. ఏపీలో పాలన బాగా సాగించాలనే తపన, తాపత్రయం ఉన్నాయని, దీనికి తగిన సహాయం అందించాలని ప్రధానిని కోరినట్లు జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా మన హక్కు. ఇప్పుడు వదిలేస్తే ఎప్పటికి సాధించలేమని అన్నారు. ప్రధానిని ఎన్ని సార్లు కలిసినా ప్రత్యేక హోదాపై ఒత్తిడి తెస్తూనే ఉంటానని జగన్ స్పష్టం చేశారు.