నా ఫ్యామిలినీ వదలడంలేదు-జగన్

నా ఫ్యామిలినీ వదలడంలేదు-జగన్

తనపై మోపిన అక్రమాస్తుల కేసులో తన భార్య వైఎస్‌ భారతీ పేరు కూడా రావడంపై వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తన కుటుంబ సభ్యులనీ వదలడం లేదని, ఆ స్థాయికి రాజకీయాలు దిగజారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన వార్తలకు ఆయన ఇవాళ ట్విట్టర్ లో స్పందించారు. 

"ఈ రోజు కొన్ని ఎంపిక చేసిన మీడియాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నా భార్యను నిందితురాలిగా పేర్కొనడం చూసి షాక్‌కు గురయ్యా... రాజకీయాలు ఎంతకు దిగజారిపోయాయంటే చివరకు నా కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టడం' లేదని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. 

 

మీడియాలో వార్తలు
వైఎస్‌ జగన్‌ ఆస్తుల కేసులో ఆయన సతీమణి వైఎస్ భారతి పేరును చేర్చినట్లు ఇవాళ మీడియాలో వార్తలు వచ్చాయి.  భారతీ సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన కేసులో ఆమెను ఐదో నిందితురాలిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు  చేస్తుంది. కానీ, వైఎస్‌ జగన్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ భారతి పేరు ఎక్కడా తన చార్జిషీట్లలో సీబీఐ పేర్కొనలేదు. అయితే ఈ చార్జిసీట్ల ఆధారంగా విచారణ జరిపిన ఈడీ భారతిని నిందితురాలిగా చేర్చింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆమెపై అభియోగాలు మోపింది. ఈ అభియోగాలను  కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.