పడవ ప్రమాదాలన్ని స‌ర్కారు హ‌త్యలే

పడవ ప్రమాదాలన్ని స‌ర్కారు హ‌త్యలే

ఆంధ్రప్రదేశ్ లో ప‌డ‌వ‌లు, లాంచీల‌కు భ‌ద్రత క‌రువైందని.. పడవ ప్రమాదాలన్ని స‌ర్కారు హ‌త్యలేనని మండిపడ్డారు వైకాపా అధినేత వైఎస్ జగన్. గోదావరిలో లాంచీ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ ఇక్కడ లంచాల‌లో ముఖ్యమంత్రి, నారా లోకేశ్‌, ఇత‌ర మంత్రుల‌కు వాటాలున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబుపై విచార‌ణ జ‌ర‌పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లా రామారావు గూడెం వ‌ద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ.. గోదావ‌రి, కృష్ణా న‌దుల‌పై జ‌రుగుతోన్న ..ప‌డ‌వ‌, లాంచీల ప్రమాదాలు స‌ర్కారు హ‌త్యలేనని.. వీటికి ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత వ‌హించాలని ఆయన కోరారు. కేవ‌లం ఆరు నెల‌ల్లో మూడు దుర్ఘట‌న‌లు చోటు చేసుకోవడం.. నదుల‌పై భ‌ద్రత లేని ప‌డ‌వ‌లు, లాంచీలు య‌థేచ్చగా తిరగడమే అని అన్నారు. వాటిలో ఏ ఒక్కటికీ ఫిట్‌నెస్ లేదని.. ముఖ్యమంత్రి అధికార నివాసానికి స‌మీపంలో గ‌త న‌వంబ‌రులో ..కృష్ణా న‌దిలో ప‌డ‌వ ప్రమాదం జ‌రిగిందని..ఈఘ‌ట‌న‌లో 21 మంది మ‌ర‌ణించారని జగన్ వెల్లడించారు. ఐదు రోజుల క్రిందట మ‌రో ప‌డ‌వ గోదావ‌రి న‌దిపై వెళ్తూ.. అగ్ని ప్రమాదానికి లోనయ్యిందని తెలిపారు. నిన్న లాంచీ గోదావ‌రి న‌దిలో మునిగి పోవడంతో.. అమాయ‌కులైన గిరిజ‌న ప్ర‌యాణీకులు మృతి  చెందారని వివరించారు. పుష్కరాల స‌మయంలో కూడా చంద్రబాబు నిర్వాకం కారణంగానే.. 29 మంది భ‌క్తులు తొక్కిస‌లాట‌లో మృతి చెందారని గుర్తు చేశారు. వీటిపై ప్రభుత్వం నామ మాత్రంగా విచార‌ణ‌కు ఆదేశిస్తోందని.. విచార‌ణ నివేదిక‌ల‌పై ఎలాంటి చ‌ర్యలు లేవని ప్రశ్నించారు. వాస్తవానికి విచారణ చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ పై జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ 25 ల‌క్షలు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.