చరిత్ర మారుతోంది.. కల నెరవేరుతుంది..

చరిత్ర మారుతోంది.. కల నెరవేరుతుంది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.  డల్లాస్ లో ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు.  అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని నా కల. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది నా కల. ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నది నా కల. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది నా కల. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టాం. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టాం. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాం.. అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.  

ప్రవాసాంధ్రులు ఏడాదికి కనీసం ఒకటి రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ కు రావాలని, ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి పనిచేయడం వలన ప్రగతి సాధ్యం అవుతుందని జగన్ అన్నారు.  త్వరలోనే పెట్టుబడుల కోసం ఓ పోర్టల్ తీసుకురాబోతున్నట్టు జగన్ తెలిపారు.  పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు ఆ పోర్టల్ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చని, ఆ పోర్టల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానమై ఉంటుందని జగన్ అన్నారు. చరిత్ర మారబోతుందని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కల నెరవేరబోతుందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.