పునాదుల గోడలను అంకితం చేస్తారా?

పునాదుల గోడలను అంకితం చేస్తారా?

మోసం చేయడంలో పీహెచ్ డీ చేశారని ఆరోపించారు వైపీసీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది. అశేష జనవాహిని తోడురాగా జగన్‌ అడుగులు వేశారు. 

ఈ సందర్భంగా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలోఆయన ప్రసంగించారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు రోజు సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కలెక్షన్ల కోసం వారం వారం పోలవరం వెళ్తున్నారని విమర్శించారు. పోలవరంలో 90శాతం కాలువల పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నయని తెలిపారు. ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని ఆరోపించారు.  శంకుస్థాపన పనులు ప్రారంభించగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం తన కల అని చెప్పుకునే చంద్రబాబు.. గతంలో 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోలవరం ప్రాజెక్టును తీసుకురాలేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. అదిగో... సింగపూర్‌ అదే... రాజధాని, అదిగో జపాన్‌ అదే.. అమరావతి అంటూ గ్రాఫిక్స్‌ చూపిస్తూ జనాన్ని మోసం చేశాడని విమర్శించారు. పుష్కరాల పేరుతో కొట్లు తినేశారని ఆరోపించారు. పుష్కరాల్లో షూటింగ్ కోసం 29 మందిని బలి తీసుకున్న చంద్రబాబు విలన్ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.