రేవంత్ రెడ్డికి షర్మిల రాజకీయ పార్టీపై కడుపు మంట..!

రేవంత్ రెడ్డికి షర్మిల రాజకీయ పార్టీపై కడుపు మంట..!

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. దీనిలో భాగంగా.. వివిధ జిల్లాల అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. మధ్య మధ్యలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ అయిన అధికారులు సైతం షర్మిలతో చర్చించారు. ఇలా పార్టీ ఏర్పాటు పనుల్లో ఆమె బిజీగా ఉంటూ.. మరోవైపు.. విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నారు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా అందరూ షర్మిల కొత్త పార్టీపై స్పందిస్తున్నారు. అయితే, షర్మిల పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు.. షర్మిల అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డిది కడుపు మంట.. షర్మిలది గుండె తడి అని వ్యాఖ్యానించిన ఆయన.. తెలంగాణను అస్థిరపరచడానికి రేవంత్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకు షర్మిల పార్టీ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవుపలికిన దేవేందర్ రెడ్డి.. తెలంగాణ సమాజంలో షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన ఓ సంచలనంగా అభివర్ణించారు. ఎవరు డబ్బు తీసుకుని పని చేస్తున్నారో ప్రజలందరూ చూశారని ఎద్దేవా చేసిన ఆయన.. షర్మిల పార్టీ ప్రకటన చేయకముందే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ కామెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ కాపీ కొడుతుందని విమర్శించిన దేవేందర్ రెడ్డి.. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా.. కాంగ్రెస్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.. కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుని పోయిందని.. రేవంత్ రెడ్డికి షర్మిల రాజకీయ పార్టీపై కడుపు మంట అంటూ మండిపడ్డారు దేవేందర్ రెడ్డి.