పవన్‌ యాక్టర్‌.. చంద్రబాబు డైరక్టర్‌..

పవన్‌ యాక్టర్‌.. చంద్రబాబు డైరక్టర్‌..

పవన్‌ కల్యాణ్‌ ఒక యాక్టర్‌.. ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్‌ అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అందుకే పవన్‌ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. ఇద్దరు కలిసే, సీట్లు పంచుకున్నారు. జనసేనకు ఒటేస్తే.. చంద్రబాబుకు ఒటేసినట్టే అని అన్నారు. ఆదివారం కాకినాడలో ఆమె ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేశారు. అన్నలాగే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ కూడా తన పార్టీని హోల్‌సేల్‌గా టీడీపీకి అమ్మేస్తారు. టీడీపీ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తారు. డబ్బులు ఇవ్వాలని చూస్తారు. అప్పుడు వాళ్లను కూర్చొబెట్టి.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. దాని ప్రకారం పిల్లల ఫీజులు చెల్లించమని అడగండి. ఆడపిల్ల పుడితే 25వేలు డిపాజిట్‌ చేస్తామని చెప్పారు.. చేశారా?. కాలేజ్‌ విద్యార్థులకు ఐ ప్యాడ్‌ ఇస్తామని అన్నారు.. ఇచ్చారా?. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని చెప్పాడు.. ఇచ్చారా?. ఇవన్నీ మీ హక్కుగా టీడీపీని అడగండి. ఇంటికోక ఉద్యోగం అన్నారు.. లేకపోతే రెండు వేలు ఇస్తానని వాగ్ధానం చేశారు. ప్రతి ఇంటికి చంద్రబాబు లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారు అన్నమాట. ఆ డబ్బులు ఇవ్వమని అడగండి అని షర్మిల అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్‌ జగన​వల్లనే అని అన్నారు. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారని తెలిపారు. బంద్‌లు, యువభేరీలు, అఖరికి వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఊరురా తిరిగి హోదా కోసం పోరాడకపోతే.. ఈ రోజు చంద్రబాబు యూ టర్న్‌ తీసుకునేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా అని నిలదీశారు. కానీ చంద్రబాబు నిజం చెప్పరని, ఎందుకంటే నాన్న చెప్పారు.. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజం చెబితే, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందటా . అందుకే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు అని షర్మిల వ్యాఖ్యానించారు.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన తెలివిమంతుడు అనుకుంటే.. ఈ లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. అ, ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం నాకే అన్నట్టు ఉంది. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. చంద్రబాబు కొడుక్కు మూడు ఉద్యోగాలు.. మాములు యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషనులు లేవు. ఈ ఐదేళ్లు లోకేశ్‌ కోసమే చంద్రబాబు పనిచేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకుంటే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. గత ఎన్నికలప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా అడిగిన చంద్రబాబు సీఎం అయ్యాక బీజేపీతో కలిసి హోదాను తాకట్టు పెట్టారు. అప్పుడు కమిషన్ల కోసం ఆశపడ్డారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదా అని నమ్మబలుకుతున్నారు అని షర్మిల అన్నారు.