కొత్త రికార్డు: 25 ఏళ్లకే పార్లమెంట్‌కు..

కొత్త రికార్డు: 25 ఏళ్లకే పార్లమెంట్‌కు..

సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీని మట్టికరిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్‌ స్థానాల్లోనూ ఆ పార్టీ హవా కొనసాగించింది. అయితే, ఈ ఎన్నికల్లో అరకులోయ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి కొత్త రికార్డు సృష్టించారు. లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్నవయస్కురాలిగా రికార్డుకెక్కారు. ఆమె వయసు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు కాగా... గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్‌ చౌతాలాపై ఉండేది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌పై 2,21,058 ఓట్ల మెజారిటీతో గెలిచిన మాధవి.. ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక మాధవి తండ్రి సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గొడ్టేటి దేముడు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి.. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవి... ఘన విజయం సాధించి రికార్డు సృష్టించి.. లోక్‌సభలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.