ఏపీలో స్పీడ్‌ పెంచిన 'ఫ్యాన్'

ఏపీలో స్పీడ్‌ పెంచిన 'ఫ్యాన్'

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది... ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా... 13 లోక్‌సభ స్థానాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన 29 మంది అసెంబ్లీ అభ్యర్థులు ముందంజలో ఉండగా... లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఆరుగురు టీడీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... టీడీపీ అభ్యర్థులు 5 స్థానాల్లో, జనసేన అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళంలో 8 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరంలో టీడీపీ ఖాతా తెరవకపోగా... వైసీపీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక విశాఖలో వైసీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... టీడీపీ ఒక స్థానంలో ముందంజలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంటే... మూడు స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. కృష్ణా జిల్లాలో 8 చోట్ల వైసీపీ ఆధిక్యంలో ఉంటే... మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గుంటూరులో వైసీపీ 11 స్థానాల్లో.. టీడీపీ 5 స్థానాల్లో ముందుంటే... ప్రకాశం జిల్లాలో వైసీపీ 7 స్థానాల్లో.. టీడీపీ 5  స్థానాల్లో ముందున్నాయి. ఇక నెల్లూరులో టీడీపీ ఖాతా తెరవకపోగా... 10 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇక కడపలోనూ 10 స్థానాల్లో వైసీపీ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అనంతపురంలో 12 స్థానాల్లో వైసీపీ.. రెండు స్థానాల్లో టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. చిత్తూరులో వైసీపీ 8, టీడీపీ 2 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.