వైసీపీకి దూరంగా.. 2న టీడీపీ గూటికి..!

వైసీపీకి దూరంగా.. 2న టీడీపీ గూటికి..!

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి కొందరు జంప్ చేస్తుంటే... మరికొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు. కాగా, కొద్ది కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్.. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. మార్చి 2వ తేదీన ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు అనుచరులు. అయితే, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఇవాళ క్లారిటీ వస్తుందంటున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన ఆయన... వైసీపీలో ఆ సీటు రాదని తెలిసి కొద్ది కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, టీడీపీలో చేరితే కాకినాడ పార్లమెంట్ టికెట్‌ను ఆయనకే కట్టబెడతారనే చర్చ సాగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌ .. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. గతంలో రెండుసార్లు ఇదే స్థానం నుంచి పోటీచేసిన సునీల్ త్రుటిలో ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన చలమశెట్టి.. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో 30 వేల ఓట్లతో ఓడిపోయారు. తర్వాత, 2014లో వైసీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యారు.