చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధమా..?

చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధమా..?

నువ్వు చెప్పింది అబద్ధం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు. చంద్రబాబుకు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్షంపై అభాండాలు వేయటం అలవాటని ఆరోపించిన పార్థసారథి.. దేశంలో ఏ సీఎం అయినా తన విజయాలు, అభివృద్ధి చెప్పుకుని ఓట్లు అడుగుతారు.. చంద్రబాబు ఏం చేయలేదు కాబట్టే మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేం సవాల్ విసురుతున్నాం, జగన్ కి హిందూజా భూములకు సంబంధం లేదు. నువ్వు చెప్పింది అబద్ధం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ ఛాలెంజ్ విసిరారు. ఈడీ, సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించిన పార్థసారథి..  2017లో రాసిన లేఖ ఇప్పుడెలా బయటికి వచ్చింది? అని ప్రశ్నించారు. మదుకాన్, రాయపాటి సాంబశివరావు నుంచి నీకు ముడుపులు ఎంత అందాయి? అంటూ మండిపడ్డ వైసీపీ నేత.. పీఠాధిపతులు అంటే నీకు ఎందుకు ద్వేషం? హిందూజా భూములు అబద్ధం అయితే చంద్రబాబు నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? అంటూ మండిపడ్డారు. మనోజ్ కొఠారి ఒక చిన్న నగర స్థాయి నాయకుడు, అతనిపై కూడా స్టింగ్ ఆపరేషన్ చేస్తారా? దానిని బ్యానర్ ఐటెమ్ లాగా వేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి పై అధికారంలోకి రాగానే విచారణ చేస్తాం అని చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అంటూ సవాల్ చేశారు.