జగన్, చిరు భేటీ.. హీట్ పెంచిన ట్వీట్..!

జగన్, చిరు భేటీ.. హీట్ పెంచిన ట్వీట్..!

ఏపీ సీఎం వైఎస్ జగన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ కాబోతున్నారన్న వార్తలతో... వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పేరుతో వచ్చిన ఓ ట్వీట్ హీట్ ఎక్కించింది. వైఎస్ జగన్ అరెస్ట్ సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని రాంచరణ్‌ ట్వీట్ చేశారని... ఇప్పుడు అదే రాంచరణ్ తండ్రితో కలిసి జగన్‌ను కలవాలని అనుకోవడం కాల మహిమ అంటూ చెవిరెడ్డి పేరుతో ట్వీట్ వచ్చింది. దానికి సైరా పేరుతో కౌంటర్ ట్వీట్లు వచ్చాయి. దీంతో జగన్-చిరు భేటీ పై పాత విషయాల ఎఫెక్ట్ ఎంత ఉంటుందోనన్న అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. అయితే తాను ఎలాంటి ట్వీట్లు చేయలేదని... అసలు తనకు ట్విట్టర్‌ అకౌంటే లేదని చెవిరెడ్డి చెప్పడంతో ఆ వివాదం సద్దు మణిగింది.

మొదటి నుంచి టీడీపీకి దగ్గరగా ఉండే సినిమా ప్రముఖులు... జగన్‌కు దూరంగా ఉన్నారు. ఒకరిద్దరు చిన్నా చితకా నటులు తప్ప సీనియర్లంతా జగన్‌ను కలవడానికి కూడా ఇప్పటి వరకు ఇష్టపడలేదు. 151 సీట్లతో ఘన విజయం సాధించిన జగన్‌ను 'మా' ఇంత వరకు అభినందించ లేదు. అలాంటిది మెగాస్టార్ స్వయంగా జగన్‌ను కలవబోతుండడంతో సినీ రంగానికి- జగన్‌కు మధ్య కొత్త బంధం మొదలైనట్టే అనే టాక్‌ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఓ వర్గం ఉంది. ఆ వర్గం జగన్‌కు అనుకూలంగా మారుతుందా? లేదా? అన్నది చూడాలి. తమ్ముడు పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ మీద ఈ భేటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది.