వరుస వివాదాల్లో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి!

వరుస వివాదాల్లో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి!

తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఉండవల్లి శ్రీదేవి  తరచూ వార్తల్లోనే ఉంటున్నారు. గెలిచింది ఫస్ట్‌ టైమే అయినా.. ఫుల్ పాపులారిటీ వచ్చింది ఆమెకు. అయితే అదంతా నెగిటివ్‌ టాక్‌ కావడమే సమస్య.  వివాదాలు ఓ రేంజ్‌లో ముసురుకుంటున్నాయి. అప్పట్లో పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ కోసం చేపట్టిన భూ సేకరణ.. అనుచరులు నిర్వహించిన పేకాట క్లబ్బులు ఇలా  అనేక వివాదాలు శ్రీదేవి కేంద్రంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని ఆయా సందర్భాల్లో  తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే ఖండించారు కూడా. అయినా వివాదాలు మాత్రం ఆగడం లేదు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని.. మరో సందర్భంలో ఇసుక వ్యాపారులపైనా నేరుగా సీఎం జగన్‌ దగ్గరే ఎమ్మెల్యే పంచాయితీ పెట్టారు.  మేడికొండూరు మండలంలోని ఓ మసీదు శంకుస్థాపనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ హాజరు కావడంతో.. తన నియోజకవర్గంలో ఆమెకు పనేంటని  అసహనం వ్యక్తం చేస్తూ మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. ఈ ఘటనలపై పార్టీలో పెద్ద చర్చే నడించింది. ఇవి చల్లారాయని అనుకుంటున్న సమయంలో 2014 నుంచి వైసీపీ కోసం కష్టపడ్డ వారిని దూరం పెట్టి.. డబ్బులు ఇచ్చిన వారికి  పార్టీ పదవులు కట్టబెట్టారని సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఎమ్మెల్యే ప్రధాన అనుచరులుగా ఉన్న శృంగారపాటి సందీప్‌, చలివేంద్ర సురేష్‌, తుమ్మూరు రమణారెడ్డిలు ఎమ్మెల్యే కార్యాలయంలోనే ఉండి .. అధికారుల బదిలీలు..  నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లు.. పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ విషయంలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు.. అక్రమ మైనింగ్‌ భారీ స్థాయిలో ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం పార్టీ పెద్దల దృష్టికి  వెళ్లడంతో.. మరోసారి ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడారట.  దీంతో అప్రమత్తమైన  ఎమ్మెల్యే శ్రీదేవి తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారట.  తనకు చెడ్డ పేరు తెస్తున్న అనుచరులు సందీప్‌, రమణారెడ్డి, చలివేంద్ర సురేష్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు సిఫారసు చేశారట. ఇంతవరకూ బాగానే ఉన్నా..ఇప్పుడు సొంత పార్టీ నేతలతోపాటు సొంత సామాజికవర్గం నాయకులు ఎమ్మెల్యే శ్రీదేవిని విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో శ్రీదేవికి  మేకల రవి అనే వ్యక్తి ఆర్థిక సాయం చేశారట. ఆ డబ్బులు అడగడానికి వెళ్లిన రవిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారట ఎమ్మెల్యే. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన రవి.. తనను ఎమ్మెల్యే శ్రీదేవి మోసం చేశారని.. తనకు మరణమే శరణ్యమని  సెల్ఫీ వీడియో తీసి అది సీఎం జగన్‌కు పంపించడం సంచలనం రేకెత్తించింది. ఈ సెల్ఫీ వీడియో రాజధాని ప్రాంతంతోపాటు అధికార పార్టీలోనూ చర్చకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యే వర్గం కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టింది. శ్రీదేవికి రవి డబ్బులే ఇవ్వలేదని చెప్పారు. కాకపోతే అప్పటికే  ఈ అంశంలో  జరగాల్సిన రచ్చ జరిగిపోయింది.  ఇలా వరుసపెట్టి శ్రీదేవిని చుట్టూ వివాదాలు ముసరడంతో ఈ ఎపిసోడ్‌ ఎటు వెళ్తుందో చూడాలి.