ఆయనదే నిర్ణయం..! రాజధానిపై క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి..

ఆయనదే నిర్ణయం..! రాజధానిపై క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి..

కొంత కాలం నవ్యాంధ్ర రాజధానిపై చర్చ హాట్ హాట్‌గా సాగింది.. అనంతరం కాస్త సైలెంట్ అనిపించినా... శాసన మండలిలో లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానంతో మరోసారి రాజధాని అంశం చర్చగా మారింది. శాసనసమండలిలో టీడీపీ సభ్యురాలు శమంతకమణి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బొత్స.. అమరావతి నుంచి రాజధానిని తరలించబోమని క్లారిటీ ఇచ్చారు.. అయితే, మరుసటిరోజే మళ్లీ మాట మార్చారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని, ఆ విషయాన్నీ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే స్పష్టత వస్తుందని అన్నారు. దీంతో రాజధాని వ్యవహారం మరోసారి రచ్చగా మారింది. ఇక, దీనిపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డి... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా రాజధాని విషయంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు సాయిరెడ్డి.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓ నెగటివ్ వ్యక్తిగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్న ఆయన.. సీఎంగా చంద్రబాబు రాష్ట్రానికి చేసింది శూన్యం అని విమర్శించారు. ఇక, కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చి.. ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన సాయిరెడ్డి... నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగా రాజధానిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు.