14న ఢిల్లీకి సీఎం జగన్.. 15న ఎంపీలతో భేటీ..

14న ఢిల్లీకి సీఎం జగన్.. 15న ఎంపీలతో భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 14వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు... 15వ తేదీన ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొననున్న ఆయన.. 1 జనపథ్‌లో ఉదయం 10 గంటలకు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 22 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పార్లమెంట్‌లో పార్టీ వైఖరి ఎలా ఉండాలన్నదానిపై ఎంపీలకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం జగన్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధులు, ఇతర అంశాలపై పార్లమెంట్ సభల్లో డిమాండ్ చేసేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలుగా గెలుపొందడంతో.. దేశంలో నాల్గో పెద్ద పార్టీగా వైసీపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.