మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు !

మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు !

టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమతానికి సంబంధించిన సమాచారం కనిపించడం పెద్ద దుమారానికి దారి తీసింది. దీనిపై నిరసన వెల్లువెత్తింది. అయితే, దీనికి సంబంధించి వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ సింఘాల్ స్పందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, మరో మీడియా అధినేత కుట్ర చేస్తున్నారని టీటీడీ బోర్డు చైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘అన్యమత ప్రచారం పేరుతో టీటీడీ మీద కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారు. కుట్రలు చేసే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీని భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సుబ్బారెడ్డి హెచ్చరించారు. దీనిపై గూగుల్ కంపెనీ వివరణ కోరామని, వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. టీటీడీకి కూడా సైబర్ క్రైమ్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరతామని చెప్పారు. గూగుల్ సెర్చ్ లో మాత్రమే అది కనిపిస్తోందని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. టీటీడీ వెబ్ సైట్ లో లేదన్నారు.