జొమాటో చేతికి ఉబర్ ఈట్స్..! డీల్ ఎంతంటే..?

జొమాటో చేతికి ఉబర్ ఈట్స్..! డీల్ ఎంతంటే..?

నచ్చిన ఫుడ్‌ను కావాల్సిన చోటుకు చేర్చే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది... దీనిలో భాగంగా... ‘ఉబర్‌ ఈట్స్‌ ఇండియా’ పేరుతో ఫుడ్ డెలివరీ చేస్తోన్న ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు చెందిన ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే డీల్ కుదిరిందని.. ఆ డీల్ విలువ 350 మిలియన్‌ డాలర్లుగా ఉందని చెబుతున్నాయి. ఆల్-స్టాక్ ఒప్పందంలో ఉబర్ టెక్నాలజీస్ ఇంక్ యొక్క ఇండియన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ఫుడ్ డెలివరీ స్టార్టప్ జోమాటో పేర్కొంది. ఇది అలీబాబా యొక్క యాంట్ ఫైనాన్షియల్ మద్దతుతో ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జోమాటోలో ఉబర్‌కు 10 శాతం వాటాను ఇవ్వనున్నారు.

ఉబెర్ టెక్నాలజీస్.. ఫుడ్ డెలివరీ వ్యాపారం ఉబెర్ ఈట్స్ 2017లో ప్రారంభించింది.. భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కష్టపడింది. దీనికి ప్రధాన కారణం.. జోమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు భారతదేశంలో ఆహార పంపిణీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడమే. ఈ నెల మొదట్లో జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్‌ గోయల్‌ మాట్లాడుతూ కంపెనీ 600 మిలియన్‌ డాలర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జొమాటో రోజుకు 13లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా.. 1,50,000 రెస్టారెంట్లతో ఒప్పందం చేసుకొంది. కాగా, జొమాటో ప్రకటన చేస్తూ డీల్ ఫైనల్ అయినట్టు స్పష్టమవుతోంది.. "జోమాటో భారతదేశంలో ఉబెర్ ఈట్స్ ను కొనుగోలు చేసినట్లు మేం ఈ రోజు ప్రకటించాం.. మీరు ఇకపై భారతదేశంలో ఉబెర్ ఈట్స్ నుండి ఆర్డర్ చేయలేరు.. కానీ, మీకు ఇష్టమైన భోజనాన్ని ఆస్వాధించగలుగుతారు... జోమాటోలో మీ కోసం రూపొందించిన అద్భుతమైన ఆఫర్‌లతో... అంటూ పేర్కొంది. ఇక, జొమాటో-ఉబర్‌ ఈట్స్‌ ఇండియా డీల్ వెంటనే అమల్లోకి వచ్చేసినట్టు తెలుస్తోంది.