ఏపీలో జడ్పీ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

ఏపీలో జడ్పీ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

ఏపీలోని జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నెల్లూరు-ఎస్టీ, అనంతపురం-ఎస్సీ లకు కేటాయించగా, చిత్తూరు, కృష్ణా జిల్లాలో బీసీలకు కేటాయించింది. ఇక విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ మహిళ, శ్రీకాకుళం, కడప, ప్రకాశం జనరల్ అభ్యర్థులకు కేటాయించగా..తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, కర్నూలు జనరల్  మహిళలకు కేటాయించారు, విజయనగరం జిల్లాలో ఎస్పీ మహిళల అభ్యర్థులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మార్చిలో విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చూడటానికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను ముగించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. రిజర్వేషన్ల తరువాత మిగిలిన ఎన్నికల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ పరీక్షలు మార్చి నాలుగో తేదీ నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఆ తరువాత వివిధ ఉన్నత స్థాయి ప్రవేశ పరీక్షలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ పరీక్షలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది. ఎన్నికల నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు, ఎన్నికల సిబ్బందిని సక్రమంగా ఉపయోగించుకునేందుకు.. 2013 ఎన్నికల్లో అమలు చేసినట్లుగానే ఈసారి కూడా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు. ప్రతి రెవిన్యూ డివిజన్‌లో ఉన్న పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశికాల ఎన్నికల నిర్వహణపైనా అధికారులకు కమిషన్‌ సూచనలు చేసింది. ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు తమతమ మండలాధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్లను చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు.