జడ్పీ చైర్మన్ ల ఎన్నికల బాధ్యత మంత్రులదే.. 

జడ్పీ చైర్మన్ ల ఎన్నికల బాధ్యత మంత్రులదే.. 

తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. జడ్పీ చైర్మెన్ ల ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు కష్టపడినట్లుగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఊరూరా తిరిగి గెలిపించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు, 5857 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు విస్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటివల జరిగిన గ్రాపంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 శాతానికిపైగా టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం ద్వారా అన్ని స్థాయిల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా, వేగంగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషిచేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.