చిత్తూరు - చిత్తూరు

2014 సాధారణ ఎన్నికలలో చిత్తూరు పార్లమెంటరీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి డాక్టర్ ఎన్.శివప్రసాద్ మరోసారి గెలిచారు. ఆయన వైసిపి అభ్యర్ధి సామాన్య కిరణ్ పై 44138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 594862 ఓట్లు వస్తే, సామాన్య కిరణ్ కు 550724 ఓట్లు సాధించుకున్నారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డాక్టర్ బి.రాజగోపాల్ కు 16672 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల టిడిపి, మూడుచోట్ల వైసిపికి అధిక్యత వచ్చింది. టిడిపికి చంద్రగిరిలో 2164, నగరిలో 1737, చిత్తూరులో 14336, కుప్పంలో 45218 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక వైసిపికి గంగాధర నెల్లూరులో 18677, పూతలపట్టులో 377, పలమనేరులో 1667 ఓట్ల అధిక్యత లభించింది.
చిత్తూరు లోక్ సభ రిజర్వు స్థానానికి మొత్తం 17సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు, టిడిపి ఏడుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలుపొందాయి. రెండుసార్లు ద్విసభ్య నియోజకవర్గం ఉంది. లోక్ సభలో తొలి స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ చిత్తూరులో రెండుసార్లు, తిరుపతిలో ఒకసారి గెలుపొందారు. ప్రముఖ కర్షక నేత ఎన్జీ రంగా చిత్తూరులో ఒకసారి, శ్రీకాకుళంలో ఒకసారి, తెనాలిలో ఒకసారి, గుంటూరులో మూడుసార్లు గెలుపొందారు. ఎన్.రామకృష్ణారెడ్డి మూడుసార్లు, టిఎన్వీ రెడ్డి చిత్తూరులో ఒకసారి, రాజంపేటలో రెండోసారి గెలిచారు. ఎంజివి.శివ రెండుసార్లు, పి.రాజగోపాలరెడ్డి రెండుసార్లు, జ్ఞానేంద్రరెడ్డి, శివప్రసాద్ రెండేసిసార్లు గెలిచారు. ఎస్.సి.పి.నాయుడు, పి.నరసింహారెడ్డి, ఎస్పీ ఝాన్సీ, డికె.ఆదికేశవులు నాయుడు ఒక్కోసారి గెలుపొందారు.