ఏలూరు - ఏలూరు

2014 సాధారణ ఎన్నికలలో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి తోట చంద్రశేఖర్ పై 101926 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాబుకు 623471 ఓట్లు రాగా, తోట చంద్రశేఖర్ కు 521545 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముసునూరి నాగేశ్వరరావుకు 11770 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆరు సెగ్మెంట్లో టిడిపి విజయం సాధించగా, వైసిపి ఒక చోట ఆధిక్యత సాధించింది. టిడిపికి ఉంగుటూరులో 12728, దెందులూరులో 18022, ఏలూరులో 25716, పోలవరంలో 15578, చింతలపూడిలో 15581, కైకలూరులో 23206 ఓట్ల మెజార్టీ లభించింది. వైసిపికి నూజివీడులో 9021 ఓట్ల ఆధిక్యత వచ్చింది. మాగంటి బాబు గతంలో కాంగ్రెస్ లో ఉండి వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన టిడిపిలో చేరారు. 2009 ఎన్నికలలో ఓడిపోయినా, 2014 ఎన్నికలలో గెలుపొందారు. 2009లో ఇక్కడ గెలిచిన కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బిజెపిలో చేరారు. అయితే ఎక్కడా పోటీ చేయలేదు.
ఏలూరు లోక్ సభ నియోజకవర్గానికి 17సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు గెలిచాయి. టిడిపి ఐదుసార్లు, సిపిఐ రెండుసార్లు, కెఎంపిపి ఒకసారి గెలుపొందాయి. సీనియర్ నేత బిఎస్.మూర్తి ఇక్కడ ఒకసారి, కాకినాడలో ఒకసారి, అమలాపురంలో మూడుసార్లు మొత్తం ఐదుసార్లు గెలిచారు. కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూడుసార్లు, బోళ్ల బుల్లి రామయ్య నాలుగుసార్లు, మాగంటి బాబు రెండుసార్లు గెలుపొందారు. కావూరి సాంబశివరావు ఏలూరులో రెండుసార్లు, మచిలీపట్నం మూడుసార్లు మొత్తం ఐదుసార్లు గెలిచారు. కొండ్రు సుబ్బారావు, వేదకుమారి, కమలాదేవి, చిట్టూరి సుబ్బారావు చౌదరి, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ ఒక్కోసారి గెలుపొందారు.